ఈశా,
నిన్ను ఎరిగిందీ లేదు, చూసిందీ లేదు – ఎవరెవరో ఎమేమో చెప్తారు. ఎలా వుంటావు నువ్వు ?
పడుచు నడుము ఒయ్యారపు ఒంపులపై తుంటరి మొటిమంత అందంగా ఉంటావా ?
వలపు వయసుల వేడి నిట్టూర్పులను దాటి ఉంటుందా నీ కౌగిలి వెచ్చదనం ?
కొంటె చందమామ కొసరి కొసరి విసిరే వెన్నెల పూల కంటే హాయిగా ఉంటుందా నీ నవ్వు ?
వైరాగ్యపు వీరుడవట, తామరాకుతో నైనా తూగగలవా – బూడిదైనా అంటదే దానికి !
నటరాజువట, ఏదీ, మా మయూరినైనా తలదన్నగలవా – ఆషాడపు నులివెచ్చని సాయంత్రాన !
అంతా తేజస్సేనట, ఏం, మా మధ్యాహ్న భాస్కరుని సెగ తగలలేదా ఇంకా నీకు !
సౌమ్యుడవట, వసంతపు వేకువలో కోయిల పాట వినబడలేదా ? అంతకంటె సౌమ్యమా నీ మాట !!