భారతీ !
నీ ముంగిరులే హిమగిరులవ్వగ…హిందు సాగరమే నీ పాద పూజలో తరియింపగ…
ప్రాశ్చాత్యం కన్నైనా తెరవక మునుపే, ఖగోళం విడమర్చావు…
మతాలంటే ఎరుగని నాడు, సనాతనమై ‘అహం బ్రహ్మస్మి’ అన్నావు.
గ్రీకువీరుని జైత్రయాత్రలకు నీ వైభవంతో తెరదించినావు..
అశోకుడి అహింసా ఖడ్గంచే జగత్తునే జయించినావు…
రాత మార్చే ‘గీత’నిచ్చిన కృష్ణుడు, ‘గీత’ దాటిన సీత కోసం వేటకేగిన రాముడు….
‘గీత’ పట్టి అహింసయన్న మహాత్ముడు….వీరు కాదా మాకు ఆదర్శం, మతమౌఢ్యమా ఇది !
ఏమని చెప్పను, ఎన్నని విప్పను…..ఎక్కడ ఆ చాణక్యులు, చరకులూ, శుశ్రుతులూ..
ఎక్కడ, ఎక్కడ ఆ ఆది శంకరులు, రామానుజులు, శ్రీ రమణులూ…!!
ఏమైనది ఆ వైభవం, ఏమైనది ఆ పౌరుషం, ఆ ధీరత్వం…..
పిరికి పందలా, గొర్రెల మందలా….ఎక్కడిదీ బుద్దిహీనత్వం, ఆత్మన్యూనతం…!!
అద్వైతం చిలికిన నీవు, అఖండమయ్యేదెన్నడు…
విశ్వమానవ సౌభ్రాతత్వమే నీ మతమవ్వగ, నీ జాతి ఒక్కటయ్యేదెన్నడు….!!
ఎంతమంది బుద్దులు మళ్ళీ పుట్టాలి, ఎన్ని వివేకానందుల గొంతుకలు కావాలి…
ఎందరు శివాజీలు త్యాగాలు చెయ్యాలి…….తల్లీ, మళ్ళీ నీవు తల ఎత్తడానికి !!
ఎన్ని జన్మలెత్తి తీర్చను నీ పేగు రుణం…అర్పివ్వనీ నీ పాదాల చెర ఓ అశ్రుతర్పణం….